TE/Prabhupada 0001 - 10 లక్షలకు విస్తరించండి



చైతన్య చరితామ్రిత ఆది-లీల 1.13 పై ఉపన్యాసం - మాయాపూర్, ఏప్రిల్ 6, 1975

చైతన్య మహాప్రభు అందరు ఆచార్యులతో అన్నారు... నిత్యానంద ప్రభు, అద్వైత ప్రభు మరియు శ్రీవాసాది-గౌర-భక్త-వృంద. వారందరు శ్రీ చైతన్య మహాప్రభువుల వారి ఆజ్ఞా పాలకులు. అందువలన ఆచార్యుల మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ జీవితం విజయవంతం అవుతుంది. ఆచార్యులవడం అంత కష్టమైన విషయం కాదు. మొట్ట మొదటగా, మనం ఆచార్యుల యొక్క నమ్మదగిన శిష్యులం అవ్వాలి. ఆయన చెప్పినది చెప్పినట్లు తూచా తప్పకుండా పాటించాలి. ఆయన్ని ప్రసన్నం చేయటానికి, కృష్ణ భావనామృతం ప్రచారానికి ప్రయత్నించడం. అంతే. ఇది అంత కష్టమైన విషయం కాదు. మీ గురువు గారి ఆజ్ఞను పాలించడానికి, కృష్ణ భావనామృతాన్ని ప్రచారం చెయ్యటానికి ప్రయత్నించండి. అది భగవానుడు చైతన్య మహాప్రభువులవారి ఆదేశం.

ఆమార ఆజ్ఞాయ గురు హనా తార' ఏయ్ దేశ
యారె దేఖ, తారె కహ 'కృష్ణ'-ఉపదేశ
(చైతన్య చరితామ్రిత మధ్య-లీల 7.128)

మా ఆజ్ఞను పాలించి, మీరు గురువులవ్వండి. మనం ఈ ఆచార్యుల పధ్ధతిని తూచా తప్పకుండ అనుసరిస్తూ, కృష్ణ భగవానుని ఆజ్ఞను ప్రచారం చేయడానికి మన శక్తి మేరకు ప్రయత్నించాలి. యారె దేఖ, తారె కహ 'కృష్ణ'-ఉపదేశ (చైతన్య చరితామ్రిత మధ్య-లీల 7.128) ఇక్కడ రెండు రకాల ఉపదేశాలు. ఉపదేశం అంటే ఆజ్ఞ. కృష్ణుని ఆజ్ఞ , ఇది ఒక కృష్ణ ఉపదేశం, మరియు కృష్ణుని గురించిన ఆజ్ఞ, ఇది కూడా 'కృష్ణ' ఉపదేశం. కృష్ణస్య ఉపదేశ్ ఇతి కృష్నోపదేశ్, సమాసము, షష్టి-తత్-పురుష-సమాసము. మరియు, కృష్ణ విషయ ఉపదేశం, ఇది కూడా కృష్ణోపదేశం, బాహు-వ్రీహి-సమాసం. ఇది సంస్కృత వ్యాకరణమును విశ్లేషించే పధ్ధతి.

కావున, కృష్ణుని ఉపదేశం, భగవద్గీత. భగవానుడు ప్రత్యక్షంగా ఆజ్ఞాపిస్తున్నాడు, ఎవరైతే కృష్ణుని ఉపదేశాన్ని ప్రచారం చేస్తారో, కేవలం కృష్ణుని వాక్యాన్నే మరల బోధిస్తారో, వారు ఆచార్యులవుతారు. ఇది కష్టమేమీ కాదు. ఇక్కడ అన్ని విషయాలు వివరించబడ్డాయి. మనం ఒక చిలక మాదిరిగా పునరుచ్ఛరించాలి. అచ్చం చిలక మాదిరిగా కాదు, చిలుకకు తన మాటకు అర్థం తెలియదు, తను మాటను మాత్రమే ఉచ్ఛరిస్తుంది కానీ, మనం మాట్లాడే పదాలను అర్థం చేసుకోవాలి లేకపోతే, ఎలా వివరించగలం? మనం కృష్ణ భావనామృతాన్ని ప్రచారం చేయదలుస్తున్నాం. కేవలం కృష్ణుని ఆజ్ఞలను చాలా చక్కగా, తప్పులు లేకుండా వివరించేందుకు తయారవ్వాలి. అలా వివరించాం అనుకోండి, ఇప్పుడు మన దగ్గర పది వేల మంది భక్తులున్నారు... మనం లక్షమంది భక్తులం అవుతాం. మనకు ఇదే కావాలి. ఆ తరువాత లక్ష నుండి పది లక్షలమంది భక్తులవుతాం, పది లక్షల నుండి కోటి మంది భక్తులవుతాం.

భక్తలు: హరీ బోల్! జై !

ప్రభుపాద: అప్పుడు ఆచార్యుల కొరత ఉండదు. అప్పుడు జనం కృష్ణ భావనామృతాన్ని చాలా సులభంగా అర్థం చేసుకుంటారు. కాబట్టి, మనం అలాంటి సంస్థను స్థాపించాలి. మనం గర్వితులం కాకూడదు. ఆచార్యుల ఆజ్ఞలను పాటించాలి మనం పరిపూర్ణులం అవ్వాలి, పరిపక్వతను పొందాలి. అప్పుడు మాయతో పోట్లాడటం సులభం అవుతుంది. అవును. ఆచార్యులు, మాయ యొక్క కార్యకలాపాలపై యుద్ధం ప్రకటిస్తారు.